రాత్రి 7 కాగానే ఆ ఊరిలో టీవీలు, ఫోన్లు బంద్.. ఎందుకో తెలుసా?*
రాత్రి 7 గంటలకు ఆ గ్రామంలో సైరన్ మోగుతుంది. వెంటనే ఊళ్లోని టీవీలన్నీ మూగబోతాయి. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోతాయి. పిల్లలంతా బుద్ధిగా పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటారు. గృహిణులు వంటపైనే దృష్టిపెడతారు. ఎనిమిదిన్నర గంటల వరకు ఇలాగే ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. మహారాష్ట్ర సంగ్లీ జిల్లా కాడేగావ్ మండలం మోహిత్యాంచె వడ్గావ్ గ్రామంలో కనిపించే దృశ్యమిది. ఆగస్టు 15 నుంచి ఆ ఊరిలో నిత్యం ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. మోహిత్యాంచె వడ్గావ్ జనాభా 3,105. లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు అక్కడి విద్యార్థులకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చారు. అప్పట్నుంచి పిల్లలంతా గంటల తరబడి మొబైల్ ఫోన్లతోనే కాలక్షేపం చేయడం ప్రారంభించారు. బడి నుంచి ఇంటికొచ్చాక పుస్తకం తీయడం దాదాపు మానేశారు. మహిళలేమో సాయంత్రం టీవీ సీరియల్స్ చూస్తూ గడిపేవారు. ఈ పరిస్థితిపై గ్రామ సర్పంచ్ విజయ్ మోహితే ఆందోళన చెందారు. దీన్ని మార్చకపోతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని భావించారు. ఆగస్టు 15న గ్రామంలోని మహిళలందరితో సమావేశం అయ్యారు. రోజూ రాత్రి 7 నుంచి 8.30 మధ్య టీవీలు, సెల్‌ఫోన్లు పూర్తిగా ఆఫ్ చేయాలని తీర్మానించారు. ఈ నిర్ణయం అమలును పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ సభ్యులకు అప్పగించారు. టీవీలు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండేందుకు గ్రామ ప్రజలు మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డారు. క్రమంగా అలవాటుపడ్డారు. సైరన్ మోగగానే పిల్లలు పుస్తకాలు తీస్తున్నారు.