భారత తొలి ఓటరు నేగీ కన్నుమూత
సిమ్లా: స్వతంత్ర భారత తొలి ఓటరు, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగీ శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు మృతిచెందినట్లు నేగీ కుటుంబసభ్యులు వెల్లడించారు. మూడు రోజుల క్రితమే ఆయన రాబోయే శాసనసభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హిమాచల్‌లోని కిన్నౌర్‌కు చెందిన నేగీ.. 1917 జులై 1న జన్మించారు. స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆయన.. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజానికి తొలి సార్వత్రిక ఎన్నికల్లో చాలా దశలు 1952 ఫిబ్రవరిలో జరిగినప్పటికీ.. హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ 5 నెలలు ముందుగానే జరిగాయి. ఆ ఏడాది అక్టోబరు 25న జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం.
అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. వందేళ్లు దాటినా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి నేటి యువతకు ఆదర్శరంగా నిలిచారు. హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబరు 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించింది. దీంతో నవంబరు 2న నేగీ.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో ఆయన ఓటు వేయడం ఇది 34వ సారి. నేగీ అనారోగ్యం దృష్ట్యా అధికారులే ఆయన ఇంటికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించారు.
నేగీ మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు. నేగీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది.