నక్షత్ర పాఠశాలలో కీచక పర్వం
మార్కులు కావాలంటే గదిలోకి రావాలంట!
ఎనిమిదో తరగతి విద్యార్థినికి పాఠశాల కరస్పాండెంట్ వేధింపులు,
నిద్ర మాత్రలు మింగిన విద్యార్థిని
తల్లిదండ్రుల ఆగ్రహం,
నెల్లూరు నగరంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కామాంధులకు నిలయాలుగా మారాయి. ఆడపిల్లలను పాఠశాలకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కొత్తూరు లోని ఓవెల్ 14 పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని పై లైంగిక దాడి ఘటన మరువక ముందే నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని నక్షత్ర పాఠశాలలో మరో కీచక పర్వం వెలుగు చూసింది. ఓవెల్ 14 స్కూల్లో పాఠశాల సిబ్బంది బాలికపై లైంగిక దాడి చేస్తే నక్షత్ర స్కూల్లో కరస్పాండెంట్ జీవన్ ఓ బాలికను వేధించాడు. దీంతో ఆ బాలిక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలిలా ఉన్నాయి. నక్షత్ర స్కూల్లో ఓ బాలిక ఆమె సోదరుడు చదువుతున్నారు. ఆ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది . అయితే ఆ బాలిక చదువులో కొద్దిగా వెనకబడి ఉంటుంది. దీనిని అలుసుగా తీసుకొని నక్షత్ర పాఠశాల కరస్పాండెంట్ జీవన్ ఆ బాలికను లైంగికంగా వేధించసాగాడు. మార్కులు తక్కువ వస్తే ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తారని భయపడుతోంది. దీనిని అవకాశంగా తీసుకొని పాఠశాల కరస్పాండెంట్ జీవన్ ఆమెను గదిలోకి రావాలని తరచు వ్యాన్ డ్రైవర్ మహేష్ చేత చెప్పిస్తుండేవాడు. వారి బాధలు తట్టుకోలేక ఆ బాలిక శుక్రవారం నిద్రమాత్రల మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె నిద్ర మాత్రలు మింగిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి ప్రధమ చికిత్స చేసి విషయం ఏమిటని ఆరా తీశారు. దాంతో ఆ బాలిక కన్నీరు మున్నీరుగా విలపించి పాఠశాలలో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో ఆ బాలిక తల్లిదండ్రులు బంధువులు పాఠశాల పై దాడి చేసి కరెస్పాండెంట్ జీవన్ ను నిల దీశారు. తాను చేసిన వికృతి కేసులు బయటకు తెలిసి పోవడంతో కరస్పాండెంట్ జీవన్ పాఠశాల నుంచి ఉడాయించేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన బాధితురాలి తల్లి కరస్పాండెంట్ జీవన్ కారు ముందు కూర్చొని కదలనీయలేదు. బాలికను వేధిస్తున్న కరస్పాండెంట్ జీవన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.