కొరమేను చేపలు ఓసిగా ఇవ్వండి!
ఇవ్వలేదని గిరిజనులపై వేధింపులు
ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ నిర్వాకం
నెల్లూరు నగరపాలక సంస్థ శానిటరీ విభాగంలో పనిచేసే కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు నిత్యం చిరు వ్యాపారులపై ఏదో ఒక రూపంలో దాడులు చేస్తూనే ఉంటారు. వీరికి కూరగాయల దగ్గర నుంచి చేపలు మాంసం వరకు ఉచితంగా ఇస్తే సరే సరి.. లేదంటే వారికి వేధింపులు తప్పవు. ఇటీవల ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ కి కొరమేను చేప తినాలని కోరిక కలిగింది. ఆయన నగరంలోని రంగనాథ స్వామి గుడికి కొంచెం దూరంగా చేపలు విక్రయించుకుంటున్న గిరిజనుల వద్దకు వెళ్లాడు. అక్కడ ఓ గిరిజనుడి వద్ద కొరమీను చేప కనిపించింది. దానిని చూడ్డంతోనే ఆయనకు ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది. అంతే తన అధికార దర్పాన్ని ప్రదర్శించి కొరమేను చేప ఇవ్వాలని చేపల విక్రయిస్తున్న గిరిజనుడికి హుకుం జారీ చేశాడు. ఆ గిరిజనుడు కొరమీను చేప కిలో 400 రూపాయలు ఉంటుందని ఉచితంగా ఇవ్వడం కుదరదని చెప్పాడు. దాంతో ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ కి కోపం వచ్చి ఇక్కడ మీరు ఎలా వ్యాపారం చేస్తారో చూస్తానంటూ ఆగ్రహంతో ఊగిపోయి అప్పటినుంచి చేపలు విక్రయించుకుంటున్న గిరిజనులపై వేధింపులు ప్రారంభించాడు. గత నాలుగైదు రోజులుగా అక్కడ రాశులుగా కోసి ఉన్న చేపలను నిర్దాక్షిణ్యంగా చెత్తను తరలించే ఆటోలో వేయడం వ్యాపారుల అక్కడి నుంచి తరిమేయడం చేస్తున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు పెన్నా నదిలోకి వెళ్లి చేపలు పట్టుకుని ఒడ్డుకు వచ్చి ఉదయం తొమ్మిది గంటల వరకు వారు పట్టిన చేపలను అమ్ముకోవడం అక్కడి గిరిజనులకు వృత్తి. గిరిజనులే కాకుండా ముస్లింలు ఇతర కులాల వారు కూడా చేపల పట్టుకొని విక్రయించుకునే వృత్తి లో ఉన్నారు. ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రతిరోజు వెళ్లి వారి పొట్టలు కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. గత ఐదు రోజులుగా ఆయన దాస్టికానికి గిరిజన ముస్లిం మత్స్య కారులు తీవ్రంగా నష్టపోయారు. ఆయన వేధింపులు తట్టుకోలేక శుక్రవారం ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తిన లక్ష్మణ శేఖర్ ఆధ్వర్యంలో బాధితులు కమిషనర్ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. చల్లా చెదురు చేసిన చేపలను తీసుకువచ్చి అక్కడ వేసి తమ బాధను వెళ్లగక్కారు. గిరిజన మత్స్యకారులపై వేధింపులకు దిగిన ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ కు నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుండడంతో ఆయన ఆగడాలు పెరిగిపోయాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. కేవలం కొరమీను చేప ఇవ్వలేదని ఇంత రాద్ధాంతం చేస్తున్న ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ పై కమిషనర్ చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.