నియంతలా వ్యవహరిస్తున్న నెల్లూరు కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత నియంతలా వ్యవహరిస్తున్నారని శేశ్రితా టెక్నాలజీస్ ఎండి నర్మద్ రెడ్డి విమర్శించారు. నగరంలోని సుజాతమ్మ కాలనీలో శేశ్రిత టెక్నాలజీస్ సంస్థ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ హరిత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేషన్ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోకుండా సమావేశం ఉందంటూ ఒక సర్కులర్ జారీ చేశారని ధ్వజమెత్తారు. ఈ విషయం కలెక్టర్ చక్రధర్ బాబుకు తెలిసి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ సమావేశం క్యాన్సిల్ అయిందంటూ మళ్లీ ఒక మెసేజ్ ను పంపారని తెలిపారు. ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో అవినీతి వేళ్ళూనుకు పోయిందని పేర్కొన్నారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను దోచుకునే వారికి నెల్లూరు నగరపాలక సంస్థలో పెద్దపేట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్న కావలికి చెందిన ఒక ఉద్యోగి అనారోగ్యానికి గురైతే ఎన్నికల అధికారిగా ఉన్న కమిషనర్ సెలవు ఇవ్వకుండా వేధించారని పేర్కొన్నారు. ఆ ఉద్యోగి ఎన్నికల విధులు నిర్వహిస్తూ పడిపోవడంతో ఆమె నెల్లూరు ఆర్డిఓ కి సమాచారం ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఆర్డిఓ కలుగజేసుకుని ఆ ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారని అయితే తీసుకురావడం ఆలస్యం కావడంతో ఆ ఉద్యోగి మరణించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు కమిషనర్ ఒక నియంతల వ్యవహరించి ఒక ఉద్యోగి మరణానికి కారణమయ్యారని ధ్వజమెత్తారు. ఆ ఉద్యోగి కుటుంబానికి ఎవరు అండగా నిలుస్తారని ప్రశ్నించారు. నెల్లూరు కమిషనర్ హరిత గతంలో నెల్లూరు ఆర్డీవో గా పని చేశారని ఆ సమయంలో ఆర్డిఓ కార్యాలయం ప్రాంగణంలో అర్జీలు రాసుకుంటూ బతుకుతున్న నిరుద్యోగులను నిర్దాక్షిణ్యంగా అక్కడ నుంచి తరిమేయించారని విమర్శించారు. పలువురు నిరుద్యోగుల పొట్టలు కొట్టిన చరిత్ర నెల్లూరు కమిషనర్ హరితకు ఉందని ఆయన విమర్శించారు. అవినీతి అధికారుల పోకడలను తాను ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు.